ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయంతో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 2 | ముత్తారం రిపోర్టర్
ముత్తారం మండలంలోని లక్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ, పొరుగు గ్రామాలైన మచ్చుపేట, శుక్రవారంపేట నుంచి పాఠశాలకు వచ్చే ఐదుగురు విద్యార్థినులకు ఎన్ఆర్ఐ డాక్టర్ ఎం. ప్రగతి వివేక్రావు ఆర్థిక సహాయంతో సమకూర్చిన సైకిళ్లను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) జి. శారద పంపిణీ చేశారు. మండల విద్యాధికారి ఎన్. హరివప్రసాద్తో కలిసి బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.
శుక్రవారంపేట గ్రామానికి చెందిన పందిళ్ల అఖిల (7వ తరగతి), పందిళ్ల తనుశ్రీ (7వ తరగతి), అబ్దుల్ అర్షియా (7వ తరగతి), జెట్టి అనూష (8వ తరగతి), మచ్చుపేట గ్రామానికి చెందిన సంగీ సాత్విక (8వ తరగతి)లకు సైకిళ్లను అందించారు.
ఈ సందర్భంగా డీఈఓ జి. శారద మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు సైకిళ్లను అందజేసిన దాత డాక్టర్ ఎం. ప్రగతి వివేక్రావును అభినందించారు. విద్యార్థులు విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.
కార్యక్రమంలో లక్కారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. సుహాసిని, బేగంపేట జెడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయులు ఎం. రాంకిషన్రావు, ఉపాధ్యాయులు రాజేశ్వర్రావు, శైలజ, అశోక్, మల్లేశం, హజీరా, అరుణ, దేవికృష్ణ, శ్రీనివాస్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి అభినందించారు.